Uterine Fibroids: స్త్రీల ఆరోగ్యంలో గర్భాశయానికి చాలా ప్రాధాన్యం ఉంది. కానీ చాలా సార్లు ఈ గర్భాశయంలో ఏర్పడే కొన్ని సమస్యలు స్త్రీల జీవన ప్రమాణాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిలో ఒక ప్రధాన సమస్య ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి (uterus) లో పెరిగే చిన్న ట్యూమర్‌లు, ఇవి సాధారణంగా కాన్సర్ సంబంధించినవి కావు. కానీ కొన్ని సందర్భాల్లో వీటి వలన సంతానోత్పత్తి సమస్యలు, పీరియడ్స్ లో అవకతవకలు, నొప్పులు వస్తాయి. మరి ఈ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు ఏమిటి, ఎలా చికిత్స చేయవచ్చో తెలుసుకుందాం.
ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి?
ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో లేదా గర్భాశయ గోడలపై ఏర్పడే గడ్డలు. ఇవి కండరాల టిష్యూ (muscle tissue) మరియు కనెక్టివ్ టిష్యూ (connective tissue) తో ఏర్పడతాయి. వైద్య పరంగా వీటిని Leiomyomas లేదా Myomas అని కూడా అంటారు. ఇవి సైజు పరంగా చాలా చిన్నవి (సెంటీమీటర్లలో) నుండి పెద్దవి (ముద్దలా) వరకు ఉండవచ్చు. కొంతమంది మహిళల్లో ఒక్కటి లేదా రెండు మాత్రమే ఉండవచ్చు, మరికొందరిలో చాలా ఫైబ్రాయిడ్స్ ఒకేసారి ఏర్పడవచ్చు.
ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి?
ఫైబ్రాయిడ్స్ ఏర్పడటానికి స్పష్టమైన కారణం ఇప్పటివరకు శాస్త్రీయంగా తెలియదు. కానీ వైద్యులు చెబుతున్న కొన్ని ముఖ్య కారణాలు ఇవి:
- హార్మోన్ల అసమతుల్యం - ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరోన్ స్థాయిలు పెరగడం వలన ఫైబ్రాయిడ్స్ త్వరగా పెరుగుతాయి.
- జెనిటిక్ ఫ్యాక్టర్స్ - కుటుంబంలో అమ్మ, అక్కలు లేదా అత్తలకు ఫైబ్రాయిడ్స్ ఉన్నా, స్త్రీలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- ఊబకాయం (Obesity) - అధిక బరువు ఉన్న మహిళల్లో హార్మోన్ మార్పులు ఎక్కువగా ఉండి, ఫైబ్రాయిడ్స్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.
- లైఫ్‌స్టైల్ కారణాలు - ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం, అధిక మానసిక ఒత్తిడి కూడా పరోక్షంగా కారణమవుతాయి.
- గర్భధారణ ఆలస్యం - ఆలస్యంగా పెళ్లి కావడం లేదా ఆలస్యంగా గర్భం దాల్చడం వలన కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఫైబ్రాయిడ్స్ లక్షణాలు ఏమిటి?
కొన్ని సార్లు చిన్న ఫైబ్రాయిడ్స్ ఏ లక్షణాలు లేకుండా ఉండిపోతాయి. కానీ పెద్దవి లేదా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్రింది సమస్యలు వస్తాయి:
- పీరియడ్స్ లో రక్తస్రావం ఎక్కువగా మరియు ఎక్కువ రోజులు రావడం
- పెల్విక్ ప్రాంతంలో నొప్పి లేదా ఒత్తిడి అనిపించడం
- తరచూ మూత్రం రావడం (bladder పై ఒత్తిడి వలన)
- మలబద్ధకం (rectum పై ఒత్తిడి వలన)
- గర్భం దాల్చడంలో సమస్యలు (fertility issues)
- గర్భం దాల్చినా, మిస్కారేజ్ అవ్వడం లేదా complications రావడం
ఫైబ్రాయిడ్స్ వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం
ఫైబ్రాయిడ్స్ కొన్ని సార్లు ఫాలోపియన్ ట్యూబ్స్‌ని బ్లాక్ చేసి స్పెర్మ్-ఎగ్ కలిసే ప్రక్రియను అడ్డుకుంటాయి. అలాగే పెద్ద ఫైబ్రాయిడ్స్ గర్భాశయంలో ఎగ్ ఇంప్లాంటేషన్ జరగకుండా అడ్డుకుంటాయి. దీంతో గర్భధారణకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి గర్భం దాల్చలేక ఇబ్బందిపడుతున్న దంపతుల్లో ఫైబ్రాయిడ్స్ ఒక ప్రధాన కారణం కావచ్చు.
ఫైబ్రాయిడ్స్‌కు చికిత్సలు ఎలా ఉంటాయి?
చికిత్స పద్ధతులు ఫైబ్రాయిడ్స్ సైజు, లక్షణాలు, స్త్రీ వయస్సు, భవిష్యత్‌లో గర్భం దాల్చాలనే ఆలోచన ఆధారంగా ఉంటాయి.
- మెడికల్ ట్రీట్మెంట్ - హార్మోన్ కంట్రోల్ చేసే మందులు ఇవ్వడం ద్వారా ఫైబ్రాయిడ్స్ పెరగకుండా ఆపవచ్చు. కానీ ఇవి శాశ్వత పరిష్కారం కావు.
- మైయోమెక్టమీ (Myomectomy) - గర్భాశయాన్ని అలాగే ఉంచి, ఫైబ్రాయిడ్స్‌ను మాత్రమే శస్త్రచికిత్స ద్వారా తొలగించే పద్ధతి. భవిష్యత్తులో గర్భం దాల్చాలనుకునే స్త్రీలకు ఇది మంచి ఆప్షన్.
- హిస్టరెక్టమీ (Hysterectomy) - ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువగా, పెద్దగా ఉంటే మొత్తం గర్భాశయాన్ని తొలగించడం చేస్తారు. ఇది చివరి పరిష్కారం.
- అధునాతన పద్ధతులు - లాపరోస్కోపీ, హైఫూ (HIFU – High Intensity Focused Ultrasound), యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ వంటి పద్ధతులు కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు.
ఫైబ్రాయిడ్స్ అనేవి స్త్రీలలో చాలా సాధారణ సమస్య. కానీ ప్రతి ఫైబ్రాయిడ్ తప్పనిసరిగా ప్రమాదకరం కాదు. చిన్నవి అయితే చికిత్స అవసరం లేకుండా అలాగే వదిలేయవచ్చు. కానీ పీరియడ్స్ సమస్యలు, తీవ్రమైన నొప్పులు, లేదా గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా నిపుణుడిని సంప్రదించాలి. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైబ్రాయిడ్స్‌ను నియంత్రించి, ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు.
Also Read: గర్భాశయం లేకుండా తల్లి కావొచ్చా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility