Oral Contraceptive Pills: గర్భనిరోధక మాత్రలు ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతాయా?

Oral Contraceptive Pills: మహిళలు గర్భధారణను తాత్కాలికంగా నివారించడానికి ఎక్కువగా ఉపయోగించే పద్ధతి గర్భనిరోధక మాత్రలు (Oral Contraceptive Pills). ఇవి సౌకర్యవంతమైనవి, సురక్షితమైనవి మరియు ఫలితాలు త్వరగా ఇచ్చే పద్ధతిగా భావిస్తారు. కానీ చాలా మంది మహిళలకు ఒక పెద్ద సందేహం ఉంటుంది.. ఈ మాత్రలు ఎక్కువకాలం వాడితే భవిష్యత్తులో గర్భం ధరించడంపై ఎలాంటి ప్రభావం చూపుతాయా? నిజానికి ఈ మాత్రలు ఎలా పనిచేస్తాయి? వాడిన తర్వాత ఫెర్టిలిటీ తిరిగి వస్తుందా లేదా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.


గర్భనిరోధక మాత్రలు ఎలా పనిచేస్తాయి?
ఈ మాత్రల్లో ప్రధానంగా రెండు హార్మోన్లు ఉంటాయి .. ఈస్ట్రోజెన్ (Estrogen) మరియు ప్రొజెస్టెరాన్ (Progesterone). ఈ హార్మోన్లు శరీరంలోని సహజ హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి ఒవ్యూలేషన్ (Egg Release) జరగకుండా అడ్డుకుంటాయి. అంటే సాధారణంగా ప్రతి నెలా ఓవరీ నుంచి ఒక అండం విడుదల అవుతుంది, కానీ ఈ మాత్రలు తీసుకున్నప్పుడు ఆ అండం విడుదల కాకుండా నిరోధించబడుతుంది. ఫలితంగా స్పెర్మ్ అండాన్ని ఫెర్టిలైజ్ చేయలేదు, గర్భధారణ జరగదు.

Also Read: ఈ టిప్స్ పాటిస్తే IVF దాదాపు సక్సెస్ అయ్యినట్టే!

మాత్రలు వాడిన తర్వాత ఫెర్టిలిటీ తగ్గుతుందా?
ఇది చాలా మంది మహిళల్లో ఉన్న ప్రధాన భయం. కానీ సైంటిఫిక్ గా మాట్లాడితే, గర్భనిరోధక మాత్రలు శాశ్వతంగా ఫెర్టిలిటీని తగ్గించవు. మాత్రలు తీసుకోవడం ఆపిన కొన్ని వారాలు లేదా నెలల్లో మహిళ శరీరంలోని హార్మోన్లు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి, మరియు ఒవ్యూలేషన్ తిరిగి మొదలవుతుంది.

సాధారణంగా:
  • కొందరిలో మాత్రలు ఆపిన 2 నుండి 4 వారాలలోనే పీరియడ్స్ మొదలవుతాయి.
  • చాలా మందిలో 3 నెలలలోపే సహజ ఒవ్యూలేషన్ ప్రారంభమవుతుంది.
  • అరుదుగా కొందరిలో 6 నెలల వరకు ఆలస్యమవచ్చు, కానీ అది తాత్కాలికం మాత్రమే.
మాత్రలు ఎక్కువకాలం వాడితే వచ్చే ప్రభావాలు: ఎక్కువ సంవత్సరాలు పాటు నిరంతరంగా మాత్రలు వాడినప్పుడు కొన్ని తాత్కాలిక మార్పులు కనిపించవచ్చు, కానీ అవి శాశ్వతం కావు. ఉదాహరణకు:
  • హార్మోన్ల సమతుల్యం కొంతకాలం దెబ్బతింటుంది
  • పీరియడ్స్ తిరిగి రావడానికి కొంత సమయం పడవచ్చు
  • కొందరిలో తాత్కాలికంగా ఎగ్ క్వాలిటీ మందగించవచ్చు
కానీ వైద్యుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో వాడితే దీర్ఘకాలిక హాని ఉండదు.

మాత్రలు వాడడం ఆపిన తర్వాత గర్భధారణ అవకాశాలు: గర్భనిరోధక మాత్రలు ఆపిన తర్వాత సాధారణంగా ఫెర్టిలిటీ పూర్తిగా తిరిగి వస్తుంది. కొన్ని పరిశోధనల్లో మాత్రలు వాడిన మహిళలు మరియు వాడని మహిళల మధ్య గర్భధారణ విజయ శాతం దాదాపు సమానంగానే ఉందని తేలింది.

అంటే మాత్రలు తీసుకోవడం వల్ల గర్భం ధరించే సామర్థ్యం శాశ్వతంగా తగ్గిపోదు. కేవలం శరీరం తిరిగి సహజ హార్మోన్ సైకిల్‌కు అలవాటు పడడానికి కొంత సమయం అవసరం అవుతుంది అంతే.

మాత్రలు వాడేటప్పుడు జాగ్రత్తలు
  • వైద్యుడి సలహా లేకుండా దీర్ఘకాలం మాత్రలు వాడకండి
  • ఎప్పటికప్పుడు పీరియడ్ సైకిల్ మార్పులు గమనించండి
  • వాంతులు, తలనొప్పి, బరువు పెరగడం లాంటి దుష్ప్రభావాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి
మీరు భవిష్యత్తులో గర్భధారణ ప్లాన్ చేస్తే, కనీసం 2-3 నెలల ముందే మాత్రలు ఆపండి

గర్భనిరోధక మాత్రలు సురక్షితమైన మరియు ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతి. ఇవి ఫెర్టిలిటీని శాశ్వతంగా ప్రభావితం చేయవు. కానీ ప్రతి మహిళ శరీరం వేరు కావడం వల్ల హార్మోన్ స్థాయిలు సాధారణ స్థితికి రావడానికి సమయం మారవచ్చు.

హైదరాబాదులో ఉన్న పాజిటివ్ ఫెర్టిలిటీ (Pozitiv Fertility) హాస్పిటల్ నిపుణ వైద్యురాలు డా. శశి ప్రియ (Dr. Sasi Priya) గారు చెప్పినట్లుగా “మాత్రలు వాడడం వల్ల గర్భధారణ అసాధ్యం కాదు. సరైన సమయంలో ఆపి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే, సహజంగా గర్భం దాల్చడం పూర్తిగా సాధ్యమే.” అందువల్ల, మీరు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నా లేదా వాడాలని భావిస్తున్నా, వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా, భయంలేకుండా ముందుకు సాగవచ్చు.


Post a Comment (0)
Previous Post Next Post