Diet for Female Infertility: ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యే ముఖ్యమైన అంశాలలో హార్మోన్ల అసమతుల్యత, పిసిఓఎస్ (PCOS), థైరాయిడ్, ఒబేసిటీ, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నాయి. ఇవి చాలా వరకు జీవనశైలి (లైఫ్‌స్టైల్) లో తగిన మార్పులు చేస్తే నియంత్రణలోకి రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం (బ్యాలెన్స్‌డ్ డైట్), వ్యాయామం, సరైన నిద్ర, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ వంటి పద్ధతులు గర్భం రాకుండా ఉన్న మూలకారణాలను తగ్గించడంలో సహాయాన్ని అందిస్తాయి.
ప్రత్యేకంగా, పిసిఓఎస్ ఉన్న మహిళలు మధుమేహం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, తక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉండి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. దీంతో ఓవ్యూలేషన్ సజావుగా జరగడంలో సహకారం కలుగుతుంది. అలాగే, జంక్ ఫుడ్, అధిక షుగర్ ఉన్న పానీయాలు, ఆల్కహాల్, ధూమపానం వంటి దుష్ప్రభావాలు కలిగించే ఆహారపు అలవాట్లను పూర్తిగా మానుకోవడం అవసరం.
నిత్య వ్యాయామం చేయడం ద్వారా శరీర బరువు నియంత్రణలోకి వస్తుంది. అధిక బరువు ఉన్న మహిళలలో గర్భం రాకపోవడం ఎక్కువగా కనిపిస్తుంది. కేవలం 5-10% బరువు తగ్గినా ఓవ్యూలేషన్ కి అవకాశం పెరుగుతుంది. యోగా, మెడిటేషన్ వంటి ఫిజికల్ మరియు మెంటల్ థెరపీలు శరీరాన్ని శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బలపరుస్తాయి. దీని వల్ల హార్మోనల్ బాలన్స్ మెరుగవుతుంది.
లైఫ్‌స్టైల్ లో నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర హార్మోన్ల విడుదలకు సహకరిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ఒక ముఖ్యమైన అంశం. స్ట్రెస్ లెవల్స్ అధికంగా ఉంటే హార్మోన్ విడుదల ప్రభావితం కావచ్చు. అందువల్ల మైండ్‌ఫుల్ లివింగ్, రీలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం అవసరం.
ఫెర్టిలిటీ సమస్యలు ఉన్న మహిళలు మొదటిగా లైఫ్‌స్టైల్ మార్పులు చేస్తే, చాలామందికి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే సహజంగా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో డైట్, లైఫ్‌స్టైల్‌తో పాటు మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరమవుతుంది. కాబట్టి, మహిళలు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గైడెన్స్‌తో పాటు ఆరోగ్యకర జీవనశైలిని పాటించాలి.
Also Read: IVF లో వేరే వ్యక్తి స్పెర్మ్ వాడతారా? మీ సందేహాలకు క్లారిటీ ఇదే.!