Secondary Infertility: చాలామంది మహిళలు మొదటి బిడ్డను సులభంగా కనగలుగుతారు కానీ రెండో సారి గర్భధారణ విషయంలో సమస్యలు ఎదుర్కొంటారు. దీనిని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ (Secondary Infertility) అంటారు. ఇది కొత్తగా గర్భం ధరించడంలో వచ్చే సమస్య కాదు, గర్భం దాల్చిన అనుభవం ఉన్న మహిళలకే తర్వాతి సారి గర్భధారణ కష్టంగా మారే పరిస్థితి. మొదటి గర్భం తర్వాత శరీరంలో జరిగే మార్పులే ఈ సమస్యకు కారణమయ్యే అవకాశముంది.
వయస్సు పెరగడం ప్రధాన కారణాలలో ఒకటి. మొదటి బిడ్డ తర్వాత మహిళ వయస్సు 30 లేదా 35 దాటినట్లయితే, ఎగ్ కౌంట్ మరియు క్వాలిటీ తగ్గిపోతుంటాయి. ఇలా హార్మోనల్ స్థాయిలు మారడం వల్ల గర్భం దాల్చే సామర్థ్యం తగ్గుతుంది.
అదే విధంగా, పురుషుల వయస్సు కూడా స్పెర్మ్ క్వాలిటీ మీద ప్రభావం చూపుతుంది, ఇది కూడా గర్భధారణను ప్రభావితం చేస్తుంది.
కొందరికి డెలివరీ అనంతరం గర్భాశయ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు, సిజేరియన్ డెలివరీ తరువాత గర్భాశయంలో ఏర్పడే scar tissue, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవడం, లేదా అనవసరమైన యుటరైన్ ఇన్ఫెక్షన్స్ వంటివి రెండో గర్భధారణలో అడ్డంకులు కలిగిస్తాయి. అంతేకాక, పెళ్లయ్యాక మధ్యలో గర్భనిరోధక పద్ధతులను ఎక్కువ కాలం ఉపయోగించినా శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
బరువు పెరగడం, జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి, నిద్రలేమి వంటి విషయాలు కూడా రెండో సారి గర్భం దాల్చడంలో ఆటంకం కలిగించవచ్చు. ఆరోగ్యకరమైన డైట్ లేకపోవడం, హార్మోనల్ ఇమ్బాలెన్స్, థైరాయిడ్, PCOS వంటి పరిస్థితులు మొదటి సారి లేకపోయినా, రెండోసారి ఏర్పడే అవకాశం ఉంటుంది.
రెండోసారి గర్భం దాల్చడం మొదటిసారి కన్నా తేలికగా ఉండకపోవచ్చు.
అలాంటి సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఫెర్టిలిటీ టెస్టులు చేయించుకోవడం, సరైన కారణాన్ని తెలుసుకుని వెంటనే తగిన చికిత్స తీసుకోవడం అవసరం. మంచి జీవనశైలి, ఆహారపు నియమాలు, మానసిక ప్రశాంతత గర్భధారణ అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.